సర్కార్‌దే పాపం.. ఎన్డీఎస్ఏపై నెపం
‘మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు తరలిస్తే అవి కొట్టుకొనిపోతాయి. ఆ బరాజ్‌ల్లో నీళ్లను నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది’ -ఇవీ రేవంత్ సర్కార్ చెప్తున్న మాటలు.
- క్యాటగిరీ-2లో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు .. ఆ జాబితాలోనే ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్
- వాటిని వినియోగిస్తూ కాళేశ్వరం బరాజ్‌లను పడావుపెట్టిన సర్కార్
- జలాలను వదిలేస్తే కొట్టుకొని పోతాయని అసత్య ప్రచారం
- రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పలుమార్లు తేల్చిచెప్పిన కేంద్రసంస్థ
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు తరలిస్తే అవి కొట్టుకొనిపోతాయి. ఆ బరాజ్‌ల్లో నీళ్లను నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది’ -ఇవీ రేవంత్ సర్కార్ చెప్తున్న మాటలు. ఆ సాకుతో ప్రాజెక్టును పడావు పెడుతూ నీళ్లను ఎత్తిపోయడం లేదు.
కానీ, ఆ రెండు బరాజ్‌లను అత్యల్ప దుర్బలమైన క్యాటగిరీ-2 ప్రాజెక్టుల జాబితాలోనే ఎన్డీఎస్ఏ చేర్చింది. అదే జాబితాలో ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టులు కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను వినియోగిస్తూ, కేవలం కాళేశ్వరంలో భాగమైన బరాజ్‌ను మాత్రమే పడావు పెడుతున్నది. దీంతో కాళేశ్వరానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తేలిపోతున్నది.
ఎన్డీఎస్ఏ సిఫార్సులు-2023
కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021ను అనుసరిస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆనకట్టల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన నియమాలు, డ్యామ్‌ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇది రూపొందిస్తుంది. అందులో భాగంగా జలాశయాల సురక్షిత పనితీరును నిర్ధారించడానికి సరైన నిఘా, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణ, ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ ఎన్డీఎస్ఏ సిఫార్సులు-2023 పేరిట కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.
నాటి నుంచి ఆ నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం వానకాలం ముందు, తరువాత నోటిఫైడ్ డ్యామ్‌లను పరీక్షించి, నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎన్డీఎస్ఏ ప్రతి సంవత్సరం వార్షిక నివేదికను విడుదల చేస్తున్నది. ఏడాది కాలంలో ఆయా డ్యామ్‌లకు సంబంధించి నిర్వహించిన పరీక్షలు, వాటి పరిస్థితిని అందులో ప్రచురిస్తున్నది. మొత్తంగా డ్యామ్‌ల భద్రత, వాటిలో నెలకొన్న లోపాల తీవ్రత తదితర సాంకేతిక అంశాలను అనుసరించి మూడు క్యాటగిరీలుగా వర్గీకరించింది. తక్షణం మరమ్మతులు చేపట్టాల్సిన ఆనకట్టలను క్యాటగిరీ-1 జాబితాలో పొందుపరిచింది. డ్యామ్‌లో చిన్నపాటి సరిదిద్ద గల లోపాలున్నా పునరుద్ధరణ పనులు చేపడుతూ వినియోగించుకో గల డ్యామ్‌లను క్యాటగిరీ-2లో పొందుపరిచింది. అత్యంత స్వల్పమైన సరిదిద్ద గల లోపాలున్న ఆనకట్టలను క్యాటగిరీ-3లో చేర్చింది.
కేవలం బరాజ్‌లే పడావు
2024-25 వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చిలో విడుదల చేసింది. మేడిగడ్డ బరాజ్‌ను క్యాటగిరీ-1 జాబితాలో పొందుపరిచింది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించింది. ఆ బరాజ్‌లకు సంబంధించి ప్రత్యేక నివేదికలను సైతం సమర్పించింది. ఇదిలా ఉండగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను క్యాటగిరీ-2 జాబితాలో పొందుపరిచింది. అతిపెద్ద ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, శ్రీశైలం, కడెం, ఎల్లంపల్లి, మూసీ, జూరాల తదితర ప్రాజెక్టులను సైతం అదే జాబితాలో పొందుపరిచింది.
పొరుగున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధవళేశ్వరం, సోమశిల తదితర రిజర్వాయర్లు సైతం క్యాటగిరీ-2 జాబితాలోనే ఉన్నాయి. అన్నింటికీ ‘సేమ్ బట్ పూర్’ అనే స్టేటస్‌నే ప్రకటించింది. క్యాటగిరీ-2 జాబితాలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ సర్కార్, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వినియోగిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరంలో భాగమైన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను మాత్రం వినియోగించకుండా పడావు పెట్టింది. ఆ రెండు బరాజ్‌ల్లో నీళ్లను నిల్వ చేస్తే కొట్టుకొనిపోతాయని అసత్య ప్రచారానికి తెరతీసింది. ఎల్ నినో నేపథ్యంలో తక్షణం మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోయాలన్న డిమాండ్స్ ఉన్నప్పటికీ, ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ ఆ పని చేయడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా క్యాటగిరీ-2లోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీళ్లు నిలిపితే కొట్టుకొనిపోతయనేది నిజమైతే, అదే క్యాటగిరీ-2లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులను ఎట్లా వాడుతున్నరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదే నిజమైతే, అన్నారం-సుందిళ్ల బరాజ్‌లు కూడా అత్యంత ప్రమాదకరమైన క్యాటగిరీ-1 జాబితాలోనే ఉండాలి కదా? అలా కాకుండా క్యాటగిరీ-2లోనే ఎందుకు పెట్టింది? ఇదిలా ఉంటే ప్రాజెక్టుల నీటి నిర్వహణ, నీటినిల్వ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని ఆయా బరాజ్‌లపై సమర్పించిన తుది నివేదికలోనే స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టుకు సైతం అదే విషయాన్ని నివేదించింది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఎన్డీఎస్ఏపై నెపం మోపుతూ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బరాజ్‌లను మాత్రమే పడావు పెడుతున్నది. మిగతా ప్రాజెక్టులను వినియోగిస్తున్నది. దీంతో కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే కక్షతోనే నీటిని ఎత్తిపోయడం లేదని, తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్నదనే విమర్శలొస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

