హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ) : రోడ్లు భవనాలశాఖ జూన్ చివరిలోగా రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు కొనసాగిస్తున్నది. మొత్తం 4,093 కిలోమీటర్లకుగాను ఇప్పటికే 1,393 కిలోమీటర్లమేర పనులు పూర్తిచేశారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, కల్వర్టులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో సీఎం కేసీఆర్ రూ.2,858 కోట్లు మంజూరుచేశారు.
1,172 రోడ్ల మరమ్మతులను గుర్తించి పనులు చేపట్టింది ఆర్అండ్బీ శాఖ. ఇప్పటివరకు 518 కోట్ల వ్యయమయ్యే 1,393 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు పూర్తికాగా, రూ.1,223 కోట్ల విలువగల 455 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా 2,700 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేయాల్సి ఉన్నది. పలు జిల్లాల్లో ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటం, దీనికితోడు అకాల వర్షాలతో మరమ్మతు పనుల్లో జాప్యం చోటుచేసుకుంటున్నదని అధికారవర్గాలు తెలిపాయి. ఏదేమైనా జూన్ చివరికల్లా పనులన్నీ పూర్తిచేస్తామని వారు ధీమా వ్యక్తంచేశారు.