హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌కు (Medigadda) వెంటనే మరమ్మతులు చేయాలని, లేకుంటే బ్లాక్ లిస్ట్‌లో చేర్చతామని ఎల్అండ్టీ (L&T) సంస్థకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అల్టిమేటం జారీ చేసింది. మరమ్మతులపై వారంలోగా నిర్ణయం చెప్పాలని గడువు విధించింది. ఈ మేరకు ఎల్అండ్టీకి రామగుండం ఎస్ఈ 14 పేజీల లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, రిహాబిలిటేషన్‌కు అవసరమైన అన్ని చర్యల్లో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. బరాజ్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తగిన సమయంలో మరమ్మతులు చేపట్టకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడం వల్లే బరాజ్ కుంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బరాజ్ డిజైన్, ఇతర సమస్యలను సాకుగా చూపుతూ మరమ్మతులు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. మరమ్మతులకు సంబంధించి ఆమోదించిన డిజైన్ డ్రాయింగ్లు, పని పరిమాణం, వ్యయాలతో సహా నష్టాలను సరిగా అంచనా వేసేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఎల్అండ్టీ కోరడాన్ని నీటిపారుదల శాఖ తప్పుబట్టింది. తక్షణమే మరమ్మతు పనులను చేపట్టాలని, సీడబ్ల్యూపీఆర్ఎస్ తదితర విభాగాలకు అవసరమైన సాయం అందించాలని, సామగ్రి, యంత్రాలను సమీకరించాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోయినా, వారంలోగా సమాధానం ఇవ్వకున్నా కఠిన చర్యలు చేపడతామని, కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని, రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది. కాగా, ఇరిగేషన్ శాఖ గతంలోనూ ఇదే తరహా లేఖ రాసినప్పటికీ ఆ ఏజెన్సీ ఏ మాత్రం పట్టించుకో లేదని తెలుస్తున్నది.