హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారంటూ రిటైర్డ్ న్యాయమూర్తి అభినందన్‌కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి మండలంలోని 4.30 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలివ్వాలని సోదరుడు అశోక్‌కుమార్ షావలితో కలిసి ఆయన హైకోర్టును కోరారు. తమ భూమిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిషేధిత జాబితాలో చేర్చుతూ 2025 నవంబర్ 6న ఏకపక్షంగా ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు తెలిపారు.
ఈ భూమిని 1980లో పట్టాదారుల నుంచి తాము కొనుగోలు చేశామని, రికార్డుల్లో తమ పూర్వీకుల పేర్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అసైన్డ్ భూములని చెప్పి అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని వివరించారు. జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పిటిషన్‌ను పరిశీలించి, ఇది స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగానికి చెందినదని, సంబంధిత న్యాయమూర్తి ఎదుట కేసు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.