కరీంనగర్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తహసీల్దార్ కార్యాలయాలనే నమ్ముకొని 20 ఏండ్లుగా సేవలందించిన టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ (టీసీవో) ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లుచల్లింది. ఎన్నికల్లో తాము గెలిస్తే.. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపింది. తహసీల్దార్ కార్యాలయాల్లో టీసీవోల సేవలు అవసరం ఉన్నాయంటూ పలువురు కలెక్టర్లు సర్కార్‌కు, సీసీఎల్ఏకు లేఖలు రాసినా.. అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం గెంటివేత చర్యలకు పూనుకున్నది. అంతేకాకుండా ఎవరైనా టీసీవోలను కార్యాలయాల్లో కొనసాగిస్తే దానికి సంబంధిత తహసీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుదని తాజాగా సీసీఎల్ఏ ఆదేశాలు జారీచేసిన తీరు కలకలం రేపుతున్నది. దీంతో ఇన్నాళ్లు ఆశల సవ్వడిలో కొట్టు మిట్టాడిన టీసీవోల భవిష్యత్తును అంధకారం చేసినట్టయింది. గడిచిన పన్నెండు నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వని సర్కార్.. ఉన్నపళంగా ఆఫీసుకు రానివ్వొద్దంటూ జారీచేసిన ఆదేశాల వల్ల రాష్ట్రంలో 632 టీసీవోలు రోడ్డున పడ్డారు. యువ జీవితమంతా రెవెన్యూశాఖకు ధారబోసిన తాము.. ఇప్పుడేమి చేయాలో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు.
632 మంది భవితవ్యం అగమ్యగోచరం
2006లో అప్పటి సమైక్య రాష్ట్రంలోనే సుమారు 1,250 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో టైపిస్టు కమ్ కంప్యూటర్ (టీసీవో) పేరిట ఆ నాటి ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 632 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిని తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించడంతో వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి మొదలు గత పిబ్రవరి వరకు ఈ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. పేరుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అయినా.. తహసీల్దార్ కార్యాలయాల్లో అత్యధిక పనులు వీరితోనే చేయించారు. వీరికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇస్తూ వచ్చారు. ఆ నాడు సమైక్య రాష్ట్రంలో చేరిన వారిలో ఎక్కువ మంది వయసు ఇప్పటికే 45 నుంచి 50 ఏండ్ల వరకు ఉన్నది. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వీరందరినీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది.
కానీ, ఇప్పుడు పూర్తిగా టీసీవోలను తొలగించాలంటూ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో విడుదలైన టీపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా నియామకం అయ్యారని ఈ పరిస్థితుల్లో టీసీవోల అవసరం ఏమైనా ఉన్నదా? అంటూ గత జనవరిలో సీసీఎల్ఏ కలెక్టర్లు, తహసీల్దార్ల నుంచి వివరాలు సేకరించింది. పనిభారం పెరిగిన నేపథ్యంలో వీరి సేవలు అవసరం ఉన్నాయని, కొనసాగింపు చేయాలని పేర్కొంటూ కలెక్టర్లు, తహసీల్దార్లు వివరాలు పంపించారు. ఆ మేరకు.. సీసీఎల్ఏ కూడా సర్కార్‌కు ఇదే విషయాన్ని నివేదించింది. కానీ, తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, గత పిబ్రవరిలో సీసీఎల్ఏ నుంచి ఒక మెమో జారీ అయింది. టీసీవోలను మార్చి చివరి నాటికి మాత్రమే కొనసాగించి ఆ తర్వాత డిస్కంటిన్యూ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే టీసీవోల అవసరాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్ల సంఘం తిరిగి (తేదీ 26 మార్చి 2026)న 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లు వారి వారి అనుభావాన్ని వివరిస్తూ.. వారి సేవలను యథావిధిగా కొనసాగించాలని సీసీఎల్ఏను కోరాయి. దీంతో ఇక తమ ఉద్యోగాలకు ఢోకా ఉండదని టీసీవోలు భావించారు. కానీ, వీటిని పట్టించుకోకుండా సీసీఎల్ఏ 2026-27 ఆర్థిక సంవత్సరానికి వారిని తీసుకోవద్దంటూ మే 15న మరో మోమో జారీచేసింది.
అధికారులదే బాధ్యత
తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పనులను పరిగణనలోకి తీసుకొని, టీసీవోలను ఇప్పటివరకూ కొనసాగిస్తూ వచ్చారు. దీంతో సీసీఎల్ఏ రెండురోజుల క్రితం అధికారులకు ఘాటుగా ఆదేశాలు జారీచేసింది. టీసీవోలను కొనసాగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని, వెంటనే వారిని కార్యాలయంలోకి రాకుండా చూడాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. దీంతో నిన్న మొన్నటివరకు పనులు చేయించుకొన్న తహసీల్దార్లు, ఇతర అధికారులు.. సీసీఎల్ఏ ఆదేశాలకు భయపడి వారిని ఆఫీసుల్లోకి రానివ్వకపోవడంతో టీసీవోల ఆశలు అడియాశలయ్యాయి.
12 నెలల వేతనాలు బకాయి
టీసీవోలకు ఇంకా సుమారు 12 నెలల వేతనాలు రావాల్సి ఉన్నది. 2025 ఏప్రిల్ నుంచి నేటివరకు వేతనాలు ఇవ్వకుండా సర్కార్ వారితో పనులు చేయించింది. ఒకవేళ సీసీఎల్ఏ ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని చూసినా.. గత మార్చి చివరి నాటికి వేతనాలు చెల్లించాలి. కానీ, 12 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకొన్న సర్కార్.. ఇప్పుడు అ వేతనాలు ఇవ్వకపోగా.. కనీసం కనికరం చూపకుండా బయటకు పంపుతున్న తీరుపై టీసీవోల కుటుంబాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. యువకులుగా విధుల్లో చేరి యుక్త వయస్సునంతా ఉద్యోగానికే ధారపోశామని, ఇప్పుడు అర్ధాంతరంగా తొలగిస్తే తమ కుటుంబాలు బతికేదెలా? అంటూ ఆవేదన చెందుతున్నారు. టీసీవోల్లో చాలామంది సుమారు 45 ఏండ్ల వయసు దాటిన వారుండగా, వారిలో చాలా మంది మహిళలు ఉండటం గమనార్హం. అలాగే దివ్యాంగులు సైతం ఉన్నారు. వీరంతా ఇన్నాళ్లూ తహసీల్దార్ కార్యాలయాలనే నమ్ముకొని జీవనం సాగించారు. ఇప్పుడు తొలగించడంతో కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పోరాటానికి సిద్ధమైన టీసీవోలు
ప్రభుత్వం ఇచ్చిన మెమోను రద్దుచేసి తిరిగి తమను విధుల్లో కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీసీవో అసోసియేషన్ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే తహసీల్దార్లు, కలెక్టర్లకు ఆయా జిల్లాల వారీగా ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. మూడు, నాలుగు రోజుల్లో సీసీఎల్ఏను కలిసి తమ గోడు వినిపించాలని అసోసియేషన్ నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో 20 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు పేస్కేల్ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్ఈఆర్పీలో ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, పంచాయతీ విభాగంలో ఎలాంటి ఉద్యోగమైనా కల్పించాలని, ఉద్యోగ పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, 632 సేవలు నిలిపి వేస్తూ జారీ చేసిన మెమోను తక్షణమే నిలిపి వేసి యథావిధిగా కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీచేసి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టీసీవోలను సర్దుబాటు చేయాలి
రెండు దశాబ్దాలపాటు చాలీచాలని వేతనాలతో జీవితాలు గడిపాం. ఎప్పటికైనా పర్మినెంట్ కాకపోతుందా! అన్న ఆశతో ఉన్నాం. ఇప్పుడు నేరుగా మా పొట్టలపైనే కొడుతున్నారు. మా పిల్లల ఫీజులు కట్టలేని దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా మా విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని వేడుకొంటున్నాం. గ్రామ పంచాయతీ ఆఫీసర్, జూనియర్ రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు దాదాపు 5వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను మాతో భర్తీ చేయాలని కోరుతున్నాం. లేదా వీఆర్వోలకు అవకాశం ఇచ్చిన మాదిరిగా 20 ఏండ్ల సేవలను దృష్టిలో పెట్టుకొని మాకూ సూపర్ న్యూమరరీ పోస్ట్‌లు ఇచ్చి సర్దుబాటు చేయాలి.
– శ్రీరాముల ఆనంద్, టీసీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి