కంఠేశ్వర్/కామారెడ్డి, జూన్ 3: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడమంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా విమర్శించారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాతోపాటు గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాజిరెడ్డి, బిగాల మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు రాజకీయంపై ఉన్న ప్రేమ.. పాలన మీద లేదని విమర్శించారు.
ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర మీది: గంప
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడటడం మానుకోవాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హితవుపలికారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్‌దేనని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ దేశంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఓరుగల్లు నుంచి మరో ఉద్యమం: దాస్యం
ప్రభుత్వ లోగో మార్పు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే ఓరుగల్లు నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ఇందుకు ఉద్యమకారులు, మేధావులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారులను చంపినోళ్లే ఇపుడు ఉద్యమకారులను సన్మానించడం చూస్తుంటే హంతకులే సంతాప సభ జరిపినట్టు ఉన్నదని దాస్యం మండిపడ్డారు.