ఆ దంపతులిద్దరూ దివ్యాంగులు. ఊరు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి. ఆసరా పింఛనే వారికి దిక్కు! ఇద్దరు పిల్లలతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరు రాకపోవడంతో ఖిన్నులయ్యారు. తమకు ఇల్లు ఎందుకు రాలేదని స్థానిక కాంగ్రెస్ నేతను అడిగితే ‘నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కు ఎందుకు పోయి నవు? బీఆర్ఎస్ వాళ్లకు మేము ఇండ్లు ఇవ్వం’ అని కరాకండిగా చెప్పినట్టు దివ్యాంగ దంపతులు బొడికె రేణుక-మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Siddipet | మద్దూరు(ధూళిమిట్ట), మే 2: రజతోత్సవ సభకు వెళ్లడంతో దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన బొడికె రేణుక-మల్లేశం దంపతులు పుట్టుకతోనే దివ్యాంగులు..ఇద్దరికీ కాళ్లు లేవు. వీరికి స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక కొన్నేండ్లుగా కిరాయి ఇండ్లలోనే ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం గ్రామానికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టు లో తమ పేరు లేకపోవడంతో ఆందోళన చెందారు.
దివ్యాంగులైన తమ కు ఎందుకు ఇల్లు మంజూరు చేయలేదని మద్దూరు ఎంపీడీవోను అడిగితే గ్రామంలోని కాంగ్రెస్ నాయకులను అడగాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బొడికె మల్లేశం స్థానిక కాంగ్రెస్ నేతలను తమకు ఇల్లు ఎందుకు రాలేదని ప్రశ్నించగా బీఆర్ఎస్ మీటింగ్కు ఎందుకు వెళ్లావని, బీఆర్ఎస్ వాళ్లకు ఇండ్లు ఇవ్వమని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దివ్యాంగులమైన తాము అర్హులం కాదా? అని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వమిచ్చే పింఛన్ తప్ప ఏ ఆధారం లేదని రోదిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.