వరంగల్, జూన్ 27 : ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న పేదల జీవితాలపై బల్దియా కొరడా ఝుళిపించింది. హనుమకొండలోని కాళోజీ సెంటర్‌తోపాటు ఏకశిల పార్కు వద్ద టిఫిన్ సెంటర్లతో జీవనం గడుపుతున్న వారి డబ్బాలను టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు జేసీబీలు తీసుకొచ్చి తొలగించడంతో చిరువ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
బడాబాబుల జోలికి వెళ్లని బల్దియా
రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేయిస్తున్న బడా వ్యాపారస్తుల జోలికి వెళ్లకుండా, రోడ్డు పక్కన డబ్బా పెడ్డుకొని బతుకుతున్న పేదలపై బల్దియా అధికారుల జులుం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగర ప్రధాన రహదారులపై ఉన్న అనేక మంది బడా వ్యాపారుల సంస్థల ఎదుట రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పార్కింగ్ స్థలం లేకున్నా పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనుమతిచ్చిన బల్దియా.. రోడ్డు పక్కన వ్యాపారం చేసే చిరువ్యాపారులపై బల్దియా కొరడాఏంటని మండిపడుతున్నారు.
ఎలా బతకాలి?
అధికారులే మా జీవితాలతో ఆడుకుంటుంటే ఎలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి బల్దియా అధికారులు వచ్చి డబ్బాలను తొలగిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రోదించారు. అందాల పోటీల నేపథ్యంలో అందాలభామలు నగరానికి వస్తున్నారని ప్రధాన రహదారిలోని చిరు వ్యాపారాలన్నింటినీ తొలగించారు. ఇప్పుడు మళ్లీ బల్దియా తమ వ్యాపారాలను తొలగించిందని ఆవేదన వ్యక్తంచేశారు.