హైదరాబాద్, జూలై 2 ( నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా గుట్టల్లో రాతి యుగం నాటి అద్భుత చిత్రకళ వెలుగులోకి వచ్చింది. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆరియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ నేతృత్వంలో సభ్యులు గడ్డం క్రాంతికుమార్, తాటి సాంబశివరావు ఈ అపూర్వ చిత్రాలను కనుగొన్నారు. ములుగు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మొద్దు గుట్ట, దర్వాజాల గుట్ట, నెమలి గుట్టలు రాతి యుగపు జీవనాన్ని కండ్లకు కడుతున్నాయి.
బొంధ్వాపోడ్ అటవీ ప్రాంతంలో భాగమైన ఈ గుట్టల రాతి గోడలపై చరిత్ర పూర్వయుగం నాటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో మానవులను పోలిన బొమ్మలతో పాటు జింక, ఎద్దు, తాబేలు, నక, అడవి దున్న వంటి జంతువుల చిత్రాలు, గీతలు, డిజైన్లు ఉన్నాయి. వీటి శైలిని బట్టి 1,000 ఏండ్ల నుంచి 10,000 ఏండ్ల మధ్య కాలానికి చెందినవై ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.