Chandrababu Naidu | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ సిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు క్లీన్చిట్ ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సీమెన్స్ సంస్థకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబై, పుణెలోని స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు వంటివి కలిపి మొత్తం 23.54 కోట్లను అటాచ్ చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టు ఈడీ అధికారులు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడినట్టుగా భావిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు చంద్రబాబుకు కేసు నుంచి ఊరట లభించినట్టు పేర్కొంటూ కథనాలు ప్రచురించాయి.
‘ఈడీ’క్లీన్ చిట్ ఇవ్వలేదు : సతీశ్‌రెడ్డి
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఈడీ తేల్చిందని వైఎస్సార్సీపీ నేత సతీశ్‌రెడ్డి చెప్పా రు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ కేసులో ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఈడీ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా క్లీన్ చిట్ ఇస్తున్నామని వెల్లడించలేదని తెలిపారు. ఈడీ ప్రెస్‌నోట్‌ను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు మెడకు ఈడీ ఉరితాడు బిగుసుకుందన్నారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టు అని, కేసు విచారణలో ఉండాగానే క్లీన్చిట్ అని చంద్రబాబు ముఠా ఎలా అంటుందని ప్రశ్నించారు.