హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంనాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. సర్వే నం.181, 182ల్లో మాత్రం యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నాగారం భూములపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఐపీఎస్‌లు రవిగుప్తా, తరుణ్ జోషి, జితేందర్‌కుమార్ గోయల్ భార్య రేణుగోయల్, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ భార్య జ్ఞానముద్ర అప్పీళ్లు దాఖలు చేశారు.
న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. అప్పీలుదారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు, ఫోర్జరీలు జరిగాయని, సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ బీర్ల మల్లేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి.. సర్వే నం.181, 182, 194, 195ల్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని, వాటిపై ఎలాంటి లావాదేవీలు, నిర్మాణాలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
పిటిషనర్ ఆరోపణలన్నీ 181, 182 సర్వే నంబర్లలోని భూములకు సంబంధించినవని తెలిపారు. పిటిషనర్ ఎకడా ఐఏఎస్, ఐపీఎస్‌లు కొనుగోలు చేసిన సర్వే నం.194, 195ల్లోని భూముల గురించి ప్రస్తావించలేదని తెలిపారు. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్నవి పట్టా భూములేనని. ఇవి భూదాన్ భూములు కాదంటూ భూదాన్ బోర్డు వాటిని విడుదల చేసిందని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం అధికారులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవని పేరొంది.