హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వం ఆరొందల కోట్లు ఇచ్చిందట. మా జీతాలెప్పుడిస్తరు? బతుకమ్మ పండగొచ్చింది. దసరా దగ్గరే ఉంది. ఈ పండుగలకైనా ఇవ్వరా? ఇప్పుడైనా మా జీతాలు ఇవ్వకపోతే ఎట్ల సార్?’ ఇది రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాలకు అధ్యాపకులు, సిబ్బంది నుంచి నిత్యం ఎదురవుతున్న ప్రశ్నలు. ఈ పరిస్థితుల్లో రూ.600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు ఇంతవరకు ఆ నిధులను విడుదల చేయనేలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధ్యాపకులు, సిబ్బం ది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక కరస్పాడెంట్లు, ఇతర యాజమాన్య బాధ్యులు సతమతమవుతున్నారు. ఒకవైపు సర్కారు ఇచ్చిందని అధ్యాపకులు, సిబ్బంది ఒత్తిడి పెంచడం, మరోవైపు సర్కారు మంజూరు చేయకపోవడంతో యాజమాన్యాలు సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సర్కారు రూ.10వేల కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల రూపంలో బకాయి పడ్డది. ఈ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నెల 15 నుంచి కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దిగొచ్చిన సర్కారు రూ.600 కోట్ల బకాయిలను తొలి విడత విడుదల చేసేందుకు ఒప్పకున్నది. వాస్తవానికి 10 వేల కోట్లల్లో రూ.600 కోట్లు అంటే కేవలం 6 శాతం మాత్రమే. అయినా కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. ఈ బకాయిలను వారంలో విడుదల చేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. వారం దాటి మంగళవారం వచ్చేనాటికి రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇదే విషయంపై సోమవారం కొందరు యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలను కలిసి ఆరా తీశాయి. దసరా వరకు బకాయిలు ఇవ్వడం కష్టమేనని తేల్చేశారని సమాచారం. వారంలో ఇస్తామని హామీ ఇచ్చారు కదా! అంటే ఎవరి వద్దకైనా వెళ్లి చెప్పుకోండి.. మేమైతే ఇచ్చే పరిస్థితి లేదు.. అంటూ చెప్పగా కాలేజీల యాజమాన్యాలు ఉసూరుమంటూ వెనక్కి వచ్చేశాయని తెలిసింది.
కొందరు యాజమాన్యాల పరిస్థితి ఇదీ!
నర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి ఐదునెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట టిమ్స్ ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేండ్లుగా డీఎంఈ అధికారులు వీరి సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ నుంచి జీతాలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదని వాపోయారు. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎంఎస్ మూర్తి, ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పీ వెంకటయ్య, ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.