తిమ్మాపూర్ రూరల్, జూలై 20: ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఎల్ఎండీ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో అధికారులు వానకాలం సీజన్‌కు ముందే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర (ఎస్సారార్) జలాశయంతోపాటు మోయతుమ్మెద వాగు నుంచి ఎల్ఎండీకి భారీగా వరద వస్తుండటంతో 10 రోజుల్లో 10 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో బుధవారం ఉదయం అధికారులు కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. మొదట 500 క్యూసెక్కులను వదిలి, సాయంత్రం వరకు విడుతల వారీగా మూడు వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని కాకతీయ కాలువ ద్వారా మైలారం రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి సూర్యాపేట జిల్లావరకు నీటిని అందించనున్నారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 19 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. 13,703 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది.