మెదక్ : ఘనాపూర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు ( Singur Project ) నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి (Padma Devender Reddy ) డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్కు వినతి పత్రం అందజేశారు.
ఘనాపూర్ ఆయకట్టు కింద రైతులు యాసంగిలో వేల ఎకరాలలో వరిసాగు చేస్తున్నారని నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుగానే క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు వరిసాగు చేసేవారు కాదన్నారు. వరి నాట్లు వేసిన తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘణపురం ఆయకట్టకు నీటిని విడుదల చేసినా అనుమతులు లేవని సంగారెడ్డి సమీపంలో ఉన్న మంజీరా డ్యామ్ వద్ద నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. హైదరాబాదు తాగునీటి అవసరాల కోసం మంజీరా డ్యాములు నీటిని నిలువ చేసినట్టు అధికారులు తెలుపుతున్నారని, పంటలు ఎండిపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
నీటిని విడుదల చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు జుబేర్, బట్టి ఉదయ్, నాయకులు పాల్గొన్నారు .