బూర్గంపహాడ్, ఆగస్టు 29 : ఓ వ్యక్తిని మరో వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టి, అతడి ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం జింకలగూడెంలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో జింకలగూడెంకు చెందిన షేక్ మౌలానా (38)కు, షేక్ ఇస్మాయిల్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ నెల 23న మౌలానాను ఇస్మాయిల్ కారుతో ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మౌలానాను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మం దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందాడు. మధ్యాహ్నం మౌలానా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు అంబులెన్స్‌లో జింకలగూడెంలోని నిందితుడు ఇస్మాయిల్ ఇంటికి తీసుకెళ్తుండగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు పోలీసులను నెట్టివేసి అంబులెన్స్‌ను నేరుగా ఇస్మాయిల్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అక్కడే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇస్మాయిల్ ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేసి, ఇంటికి నిప్పంటించారు. అప్పటికే ఇస్మాయిల్ ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. అంతేకాక ఇస్మాయిల్ బావ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఎస్సై మేడా ప్రసాద్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 40 మంది కానిస్టేబుళ్లు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.