హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిబంధనలంటే అందరికి సమానం. ఇక రిటైర్మెంట్ విషయంలో ఎవరికీ మినహాయింపేం కాదు. కానీ ఉన్నత విద్యామండలి మాత్రం ఈ విషయాన్ని విస్మరించి నడుచుకుంటున్నది. రెగ్యులర్ వారికి ఒకలా.. కాంట్రాక్ట్ వారికి మరోలా నిబంధనలను అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నది. ఒకవైపు రెగ్యులర్ ప్రొఫెసర్లు 60 ఏండ్లకే పదవీ విరమణ పొందుతుండగా, 60 ఏండ్లు దాటిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తిరిగి కొనసాగించవచ్చని ఆదేశాలిచ్చింది. వర్సిటీలకు మండలి లేఖలు రాసింది. ఇది వివాదాస్పదమైంది.
ఈ లేఖపై ఉన్నత విద్యామండలి వర్సెస్ వర్సిటీలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇటీవల ఉన్నత మండలి అన్ని వర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో లేఖ ప్రస్తావన రాగా, ఓయూ, మహత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ వర్సిటీల వైస్చాన్స్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదేం విధానమని, ఎలా కుదురుతుందని మండలి అధికారులను నిలదీసినట్టు తెలిసింది. అటానమస్ హోదా గల వర్సిటీల విషయంలో మండలి జోక్యం తగదని కొందరు వీసీలు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. మండలి కేవలం సూచనలు, సలహాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్టుగా అధికారుల్లో చర్చలు నడుస్తున్నాయి.
వర్సిటీల్లో అవసరముంటే 60 ఏండ్లు దాటిన వారిని తీసుకోవాలని సూచన మాత్రమే చేశాం. అవసరాన్ని బట్టి పరిశీలించమన్నాం. అదేం జీవో కాదు. కేవలం సర్క్యులర్ మాత్రమే. అయినా కొనసాగించాలా.. లేదా అన్నది వీసీల ఇష్టం. తప్పనిసరిగా అమలుచేయాలన్న నింబంధనలేం లేవు.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి