హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ‘చలో సెక్రటేరియట్’ను విజయవంతం చేయాలని 12 యూనివర్సిటీల్లోని పార్ట్‌టైం లెక్చరర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్ట్‌టైం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాకతీయ యూనివర్సిటీతోపాటు చాకలి ఐలమ్మ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు చెందిన పార్ట్‌టైం అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు సోమేశ్వర్, జానకిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్సిటీల్లో 900 మంది పార్ట్‌టైం అధ్యాపకులు ఉన్నారని, జీవో 21 ప్రకారం రెగ్యులర్ అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తే తమ ఉద్యోగాలు పోతాయని, తమ కుటుంబాలు రోడ్డుపాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధ్యాపక నియామకాల్లో పార్ట్‌టైం అధ్యాపకులకు ప్రథమ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. సర్కారు దిగిరాకపోతే ఈ నెల 17న ‘చలో సెక్రటేరియట్’ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.