హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. వచ్చే నెల 22 వరకు నెలపాటు 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 45 వేల గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని 5 వేల వార్డుల్లో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గ కన్వీనర్లు, సమన్వయకర్తలకు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ నాందేడ్‌లోని అనంత్లాన్స్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. గ్రామాల్లో గులాబీ శ్రేణులు కండువాలు కప్పుకొని ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’, ‘జై మహారాష్ట్ర’ అనే నినాదాలతో కదంతొక్కారు. మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే సహా పలువురు నేతలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. నాందేడ్‌లోని మాతా రత్నేశ్వరి మౌజే వదేపురి నుంచి శంకరన్న దోండ్గే ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుభాష్ మోరే, బాలకిషన్ పాటిల్, విలాస్ కల్యాణ్, శంభాజీ పవార్, సహా గ్రామ సర్పంచ్ బల్వంత్ మోరే, పుయెద్ గ్రామ సర్పంచ్ భాసర్ తదితరులు పాల్గొన్నారు.