land Registration | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయబోతున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఈ నిబంధనను భూభారతి చట్టంలో పొందుపర్చిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని సలార్‌నగర్, ఖమ్మం జిల్లాలోని ములుగుమాడు, ములుగు జిల్లాలోని నూగూరు, సంగారెడ్డి జిల్లాలోని సాహెబ్‌నగర్, జగిత్యాల జిల్లాలోని కొమ్మనపల్లి గ్రామాల్లో ఈ వారంలోనే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నది. సర్వే బాధ్యతలను అనుభవం కలిగిన పలు సంస్థలకు అప్పగించినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూమిని సర్వే నంబర్లవారీగా డ్రోన్‌తో సర్వే చేయడం ద్వారా సరిహద్దులను గుర్తించి ఆ మ్యాప్‌ను జత చేస్తారు.
రైతులపై సర్వే భారం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేయడమంటే రైతులపై ఆర్థిక భారం మోపడమేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రతి భూమి క్రయ, విక్రయానికి కచ్చితంగా మ్యాప్ ఉండాల్సిందే.. అంటే ఒక భూమిని అమ్మినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా సర్వే చేయించాల్సిందే. ఈ సర్వేను రైతులే తమ సొంత డబ్బులతో చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో సర్వే పేరిట రైతులను వీరబాదుడు బాదడం ఖాయమని తేలిపోయింది. సర్వే కోసం సర్వేయర్లు ఎకరాలవారీగా వసూలు చేస్తారు. దీంతో సర్వే కోసం రైతులు రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సర్వేయర్ల అరాచకాలు తప్పవా?
సర్వేయర్ల అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ముఖ్యంగా సామాన్యుల భూములను సర్వే చేసేందుకు వారు పట్టపగలే చుక్కలు చూపిస్తారు. సర్వే కోసం ప్రభుత్వానికి చెల్లించిన ఫీజు కాకుండా సర్వేయర్లకు ప్రత్యేకంగా ముట్టజెప్పుకోవాల్సిందే. లేదంటే సర్వే పూర్తికాదు, పని జరగదు. ప్రస్తుతం సర్వే అవసరం అంతంత మాత్రంగా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేస్తే సర్వేయర్ల అరాచకాలు మరింత పెరగడం ఖాయమని స్పష్టమవుతున్నది.
సర్వే మ్యాప్‌లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో భూముల సర్వే సందర్భంగా సర్వేయర్లు మరిన్ని అవకతవకలకు పాల్పడే అవ కాశం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మళ్లీ కొత్త చిక్కులు తప్పవేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.