RRR | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని చేపట్టనున్నారు. సీఎం సూచనల ప్రకారం ప్రతిపాదిత అలైన్మెంట్లో అధికారులు మార్పులు చేయగా, సీఎం ఆమోదం తెలిపారు. దీంతో దక్షిణభాగం రోడ్డు 189 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో అడ్డంకులు ఎదురవుతుండగా, భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రాజెక్టు మంజూరై మూడున్నరేండ్లు పూర్తవుతున్నా ఇంతవరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. కేంద్రం నుంచి, జాతీయ రహదారుల శాఖ సరైన సహకారం లభించటం లేదు.
నష్ట పరిహారం పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఉత్తర భాగం టెండర్ల ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో తాము అధికారంలో ఉండగానే ఆర్ఆర్ఆర్ను పూర్తిచేయాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. దక్షిణ భాగం పనులను ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. భూసేకరణ సహా రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుందని, నాలుగు టోల్ ప్లాజాలను ఏర్పాటుచేసి 20-25 ఏండ్ల పాటు టోల్ వసూళ్ల ద్వారా పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవచ్చని అంచనా వేశారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ
సీఎం సూచనల ప్రకారం రోడ్డు నిర్మాణంలో సాధ్యమైనంత తక్కువగా ప్రైవేటు భూములు ప్రభావితం అయ్యేలా, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఎక్కువగా ఉపయోగించుకునేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరిస్తూ సాధ్యమైనంత తక్కువగా ప్రైవేటు భూములు ప్రభావితమయ్యేలా అలైన్మెంట్ ఖరారుచేశారు. ముచ్చర్ల ప్రాంతంలో భారీ జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని దృష్టిలో ఉంచుకొని రేడియల్ రోడ్లు వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు భూములు ప్రభావితం అవుతున్న ప్రాంతాల్లో ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని, భూములు కోల్పోతున్న రైతులకు అక్కడే అభివృద్ధి చేసిన భూమిని ప్లాట్ల రూపంలో కేటాయించి.. వాటి అభివృద్ధికి అవసరమైన డెవలప్మెంట్ రైట్స్ కూడా ఇవ్వాలని తెలిపారు.
దీంతో రైతులు కోల్పోతున్న భూములకు సరైన న్యాయం లభిస్తుందని, రైతులు కూడా ఇందుకు సంతోషంగా ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తున్నది. ఖరారైన అలైన్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల బృందాలను పంపారు. హెచ్ఎండీఏ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటి పారుదల, ఆర్అండ్బీ, టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు భూముల సేకరణలో క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదా? రైతులు ఏం కోరుకుంటున్నారు? వారికి నష్టం జరుగకుండా ఏం చేయాలి? తదితర అంశాలను అధ్యయనం చేసి రైతులు కోరుతున్న అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తంకాకుండా వారు కోరుకున్నట్టు డెవలప్మెంట్ రైట్స్ కల్పించాలని నిర్ణయించారు.
తమ ఆధ్వర్యంలోనే పూర్తిచేయాలని..
ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కూడా ఉన్నది. తన హయాంలో ఏదో ఒక్కటైనా భారీ ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులను వెంటనే ప్రారంభించి సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. ఉత్తర భాగం మంజూరు చేసిన మూడున్నరేండ్లకు కూడా ఇంకా టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇదే పద్ధతిలో ముందుకుపోతే దక్షిణ భాగానికి ఎన్నేండ్లు పడుతుందో తెలియదు. పైగా, కేంద్రం ఆధ్వర్యంలో చేపడితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పెద్దగా ఉండదు. శంకుస్థాపన కార్యక్రమానికి తమ పార్టీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉండదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించటం ఉత్తమమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి-ఆమన్‌గల్-షాద్‌నగర్-చౌటుప్పల్ ప్రాంతాలగుండా సాగనున్నది.