న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 వార్షిక బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాదాపు రూ.40 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్లో ఏ వర్గానికీ పెద్దగా ఊరట లభించలేదు. మొత్తంగా దేశం చెవిలో బీజేపీ.. ‘కమలం పువ్వు’ పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహమ్మారి విలయంతో ఆర్థికంగా చితికిపోయిన సామాన్య, మధ్యతరగతి, వేతన జీవులకు ఈ బడ్జెట్లో దక్కిందేమీ లేదు. కరోనా కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మందికి వేతనాల్లో కోత పడింది. ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో తమకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంటుందని ఎంతో ఆశగా చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. వారికి ఆదాయపన్నులో ఆర్థిక మంత్రి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి స్వల్ప మార్పులు చేశారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉంటే అసెస్మెంట్ ఏడాది నుంచి రెండేండ్లలోపు అప్డేటెడ్ రిటర్నులను దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఘనంగా ప్రకటించిన మోదీ సర్కారు.. వ్యవ‘సాయానికి’ బడ్జెట్లో పెద్దగా విదిల్చిందేమీ లేదు. పైగా ఎరువుల రాయితీపై భారీగా కోత పెట్టింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికీ తూట్లు పొడిచింది. నిధులను భారీగా తగ్గించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉన్నా.. ఆరోగ్య రంగానికి కేటాయింపులు స్వల్పంగానే పెంచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై వ్యయం పెంచడం ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందని నిర్మల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చేందుకు ‘పీఎం గతి శక్తి’ దోహదపడుతుందన్నారు. రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ప్రజా రవాణా, జలమార్గాలు, సరుకు రవాణా సదుపాయాలు చోదకాలుగా పనిచేస్తాయని చెప్పారు. భారత్ 75 ఏండ్ల అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్నదని, ఈ బడ్జెట్ వచ్చే 25 ఏండ్ల కాలానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్‌కు అంతకుముందు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను
క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్టు నిర్మల ప్రకటించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30 శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయంతో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని జారీచేయనున్నట్టు తెలిపారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో చిప్ ఆధారిత ఈ- పాస్‌పోర్టులను జారీచేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద 2022-23లో అన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ నెట్ వర్క్ సేవలు అందించేందుకు కాంట్రాక్టులు ఇస్తామని తెలిపారు. స్వాత్రంత్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటుచేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11.6 లక్షల కోట్ల రుణాల్ని కేంద్రం సమీకరించనున్నది.
బడ్జెట్లోని మరికొన్ని ముఖ్యాంశాలు
ఉత్సాహంగా పన్నులు కట్టారు .. ధన్యవాదాలు
ఈ రోజు ఉదయం నా దృష్టికి వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది నా ప్రసంగంలో భాగం కాదు. అయినా సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. జనవరిలో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిలో పుంజుకున్నాయి. ఆ నెలలో దేశవ్యాప్తంగా 1.40 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఈ పురోగతికి పన్ను చెల్లింపుదారులే కారణం. వారికి ప్రశంసలు. వారు ఉదారంగా, ఉత్సాహంగా పన్నులు చెల్లించి వృద్ధికి దోహదపడుతున్నారు.
-బడ్జెట్ ప్రసంగంలో నిర్మల
మినహాయింపులు ఇవ్వలేకపోయా.. నన్ను మీరు క్షమించాలి
ఆదాయ పన్నులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేనందుకు క్షమాపణలు. అయితే పన్నులు తగ్గించే సందర్భాలూ వస్తాయి. కొన్ని సార్లు ప్రజలు ఓపిక పట్టాల్సి ఉంటుంది.
-మీడియా సమావేశంలో నిర్మల
క్షమించినవారే నిజమైన ధైర్యవంతులు
ధైర్యవంతుడే మొదట క్షమాపణలు కోరతాడు. శక్తిమంతుడే మొదట క్షమిస్తాడు. సంతోషపరుడే చటుక్కున మరిచిపోతాడు.
-2014, నవంబర్ 1న నిర్మల ట్వీట్