కడెం : జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు (Kadem Project) వరదనీటి ( Flood Water) రాక కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (4.699టీఎంసీల) వద్ద ఉంది. గురువారం రాత్రి భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేటు నంబర్ 9 ఎత్తి 4,346 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం వరకు ఇన్ఫ్లో 1,581 తగ్గడంతో వరదగేటును మూసినట్లు ఈఈ విఠల్ తెలిపారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున వరదగేట్లను ఎత్తే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.