హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమో, సర్కస్ కంపెనీనో అర్థం కావడంలేదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్టు పాత తేదీ (మార్చి 15, 2024)తో ఉత్తర్వులు ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీలో గొడవలకు నిదర్శనమని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. సరారు చట్టవిరుద్ధంగా వ్యవహరించకుం డా చూడాల్సిన బాధ్యత సీఎస్‌దేనని, దురదృష్టవశాత్తు సీఎస్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మార్చి 15న జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం వరకు ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులను ప్రభుత్వ వెబ్సైట్లో ఎందుకు పొందుపరచలేదు? కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారు నెలలుగా బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు? అని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.