హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ఇది తగదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్‌పై నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పాల్గొని తెలంగాణ అభిప్రాయాలను వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలపై పడే ప్రభావాన్ని ఈ సదస్సులో వివరించామని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభలో సీటింగ్ సామర్థ్యాన్ని 888 స్థానాలకు, రాజ్యసభలో 384 స్థానాలకు పెంచడం డీలిమిటేషన్‌పై జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూరుస్తున్నదని తెలిపారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ర్టాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. చెన్నై సమావేశంలో రాష్ర్టాల్లో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉందని బీఆర్ఎస్ తరఫున సూచించినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం వల్ల పరిపాలన మెరుగవుతుందని సూచించామని తెలిపారు.
జనగణన ప్రకారం దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను గతంలో ప్రవేశపెట్టారని వినోద్‌కుమార్ తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో జనాభా లెక్కల ఆధారంగా మొదటిసారిగా డీలిమిటేషన్ కసరత్తు జరిగినట్టు వెల్లడించారు. 1961 జనాభా లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను 494 నుంచి 522కి, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 3,771కి పెంచినట్టు వెల్లడించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో మూడోసారి డీలిమిటేషన్ జరిగిందని పేర్కొన్నారు. దీంతో ఎంపీ స్థానాల సంఖ్య 522 నుంచి 543కు పెరిగినట్టు తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 3,771 నుంచి 3,997 పెరిగినట్టు చెప్పారు.