హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీది చిల్లర రాజకీయమని రెడ్కో మాజీ ఛైర్మన్ వై సతీష్‌రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగిన మాగంటి గోపినాథ్ సతీమణి సునీత, ఆమె కుమార్తెపై అక్రమ కేసు బనాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
భర్తని కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన కూతురు ప్రజల మధ్యకు వెళ్తే కూడా పోలీస్ కేసా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై ఒక పక్క రౌడీ రాజ్యం, ఇంకో పక్క పోలీసు రాజ్యం అరాచకం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయం అనే టైటిల్‌తో ఉన్న ఒక పోస్టర్‌ను తన పోస్టుకు జతచేశారు.
ఆ పోస్టర్లో మాగంటి సునీత, ఆమె కుమార్తె ఫొటోలు ఒకవైపు.. సీఎం రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫొటోలు మరోవైపు ఉన్నాయి. అరాచకానికి గుర్తుగా రేవంత్, నవీన్ ఫొటోలను బ్లాక్ షేడ్ చేశారు. ఓటమి భయంతో అధికార దుర్వినియోగం, ఆడబిడ్డలపై అక్రమ కేసు బనాయింపే సాక్ష్యం అనే కొటేషన్లు కూడా ఆ పోస్టర్లో ఉన్నాయి.