హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై కాంగ్రెస్‌కు ఏపాటి ప్రేమ ఉన్నదో రేవంత్ వ్యాఖ్యలతో తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌ది పూర్తిగా ప్రజావ్యతిరేక విధానమని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్తు, 24 గంటల కరెంటు ఉండవనే విషయం స్వయంగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. రాజకీయాలను వాడుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే రేవంత్ రెడ్డికి రైతుల కష్టం ఎలా తెలుస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రైతులను నిండా ముంచిన పార్టీలేనని.. రైతులకు ఎప్పటికైనా సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే ‘భారతీయ రైతుల సమితి’ అని కూడా అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.