హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతులు, ఆత్మ బలిదానాలు చేసుకొన్న అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’ అనే కార్యక్రమాన్ని చేపట్టండి.. అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత కరెంటు వచ్చిందని, ఇప్పుడు సరిగా ఇవ్వడం లేదంటున్న ఆ పార్టీ నేతల వాదనను తీవ్రంగా ఆయన తీవ్రంగా ఖండించారు. కరెంట్ సరిగా వస్తున్నదో లేదో తెలవాలంటే కాంగ్రెస్ నాయకులు బావుల వద్ద కరెంటు వైర్లను పట్టుకొని సెల్ఫీలు దిగాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో రాత్రిపూట బావుల వద్దకు వెళ్లి విద్యుత్తు షాక్‌తో, పాముకాటుకు ఎందరో రైతులు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొన్నారని తెలిపారు. వారి కుటుంబాల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు.