హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మీడియా ముందు నిలబడి, ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము దేశ ప్రధాని నరేంద్ర మోదీకే లేదని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. మోదీ ప్రధాని అయ్యి ఎనిమిదేండ్లు అవుతున్నా ఏనాడూ ప్రెస్‌మీట్ పెట్టలేదని విమర్శించారు. మీడియా అంటేనే దడుసుకొనే బీజేపీ నేతలు.. సీఎం కేసీఆర్‌కు నీతులు చెప్పడం తగదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అయినా, పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా సరే.. అకడి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారని స్పష్టంచేశారు.
బీహార్ పర్యటనలోనూ అదే జరిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మద్దతిస్తున్నారు కాబట్టే.. తన రాష్ర్టానికి ఆహ్వానించారని చెప్పారు. ఇద్దరు సీఎంలను అసంబద్ధ ప్రశ్నలతో బీజేపీ అనుకూల మీడియా ఇరుకున పెట్టాలనే కుట్రను గ్రహించే నితీశ్‌కుమార్ ‘ఇక ప్రశ్నలు అడగొద్దు.. ధన్యవాదాలు’ అని లేచారని ఆయన పేర్కొన్నారు. అంతేగానీ బీజేపీవాళ్లు ప్రచారం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమ్మతి లేకపోవడం వల్ల కాదని స్పష్టంచేశారు. కేసీఆర్ సత్తా తెలుసుకాబట్టే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఫేక్‌న్యూస్ వ్యాప్తిలో, ఒక అంశానికి మసిపూసి.. తప్పుడు ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు పీహెచ్డీ చేశారని ఆయన ధ్వజమెత్తారు.