రాజాపేట, మే 22: ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చల్లటి వాతావరణానికి ఆరుద్ర పురుగులు వచ్చేశాయి. మామూలుగా ఇవి కనిపిస్తే వర్షాలు పుష్కలంగా కురుస్తాయని రైతుల నమ్మకం. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో తొలకరి వర్షం పలకరింపుతోనే అందమైన ఎర్రటి ఆరుద్ర పురుగులు నేలపై కనిపించాయి. ఆరుద్ర కార్తె రాకముందే పంట పొలాల్లో కనిపించడం శుభసూచకమని రైతులు అంటున్నారు. 20 రోజుల ముందే కనిపించడం వల్ల పంటదిగుబడి పెరుగుతుందని, ఇవి పంటలకు మిత్ర పురుగులని చెబుతున్నారు.
పర్యావరణ నేస్తాలు ఆరుద్ర పురుగులు
అందంగా కనిపించే ఆరుద్ర పురుగును కొన్నిచోట్ల పట్టు పురుగు, చందమామ పురుగు, లేడీ బర్డ్, ఇంద్రగోప పురుగు, కుంకుమ పురుగులు అని కూడా అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ క్లాత్ తో చేసిన బొమ్మలా ఉంటాయి. ముట్టుకోగానే అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతాయ్. ఇంగ్లీష్ లో రెడ్ వెల్వెట్ మైట్ (Red Velvet Mite) లేదా రెయిన్ బగ్ అని పిలిచే ఈ పురుగులు ఆకర్షణీయమైన ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇవి నేలను గుల్లబారకుండా చేసి పంటలకు పోషకాలు అందిచడంలో సహకరిస్తాయి. అందుకే వీటిని పర్యావరణ నేస్తాలు అంటారు.
ఈ పురుగులు మట్టిలో గుడ్లను పెడతాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో గుడ్లు అభివృద్ధి చెంది లార్వాలు జనిస్తాయి. పరిసరాలలో పూర్తిస్థాయి అనుకూల పరిస్థితుల్లో మాత్రమే గుడ్లు అభివృద్ధి చెందుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటే గుడ్లు జీవాన్ని కోల్పోలాయి. ఇవి కొన్ని రకాల కీటకాలపై కొంతకాలంపాటు పరాన్నజీవులుగా ఉండి తిరిగి మట్టిలో చేరి ప్రౌఢదశకు చేరుకుంటాయి. వర్షాల రాకతో నేల నుంచి బయటకు వస్తాయి. ఎదిగిన ఆరుద్ర పురుగులు శీతాకాలంలో సుప్తావస్థలో ఉంటాయి. కొద్దికాలం మాత్రమే నేలపై కనిపిస్తాయి. ఆ సమయంలో ఆహారం, జత కోసం వెతుకుతాయి. ఆరుద్ర పురుగులు కనిపించడాన్ని రాబోయే వర్షాలకు సూచనగా భావిస్తారు.
‘ఆరుద్ర’తో రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీడువారిన నేలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. దీంతో ఆ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ.. రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. అలా ఆరుద్ర పురుగులు, రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా, బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు.