దోమలపెంట, నవంబర్ 6: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో రికార్డు స్థాయి విద్యుత్తు ఉత్పత్తి చేసినట్టు సీఈ రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి వరదలు భారీగా రావడంతో టార్గెట్ను దాటి 1,646 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని, జనవరి వరకు మరింత ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెప్పారు.
అధికారులు, ఉద్యోగులు, కార్మికుల కృషితోనే ఈ రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. ఎడమగట్టు కేంద్రంలోని నాలుగో యూనిట్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని వివరించారు. నిత్యం 37,500 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ ఐదు యూనిట్లలో 15 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు.