హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయో లేదో అప్పుడే ఇంజినీరింగ్ బీ-క్యాటగిరీ సీట్ల దందా మొదలైంది. కన్వీనర్ కోటా అడ్మిషన్లు షురూ కాకముందే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. సిఫారసు లేఖలు, సీట్ల బ్లాక్ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.రాష్ట్ర మంత్రు లు మొదలు ఐఏఎస్ల వరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ మంత్రి మూడు కాలేజీలకు సిఫారసు లేఖలు పంపించినట్టు తెలిసింది. ఓ సీనియర్ ఐఏఎస్ రెండు కాలేజీల్లో సీట్లు అడిగినట్టు సమాచారం. ఓ సంస్థ చైర్మన్ తమ సంబంధీకుల కోసం సీట్లు
బ్లాక్ చేయాలని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.
టీజీ ఎప్సెట్ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సారి పేపర్లు కాస్త కఠినంగా రావడంతో చాలా మంది అంచనాలు తప్పాయి. అనుకున్న ర్యాంకులు రాలేదు. దీంతో కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయో..? రావో..? అని అంచనా వేయలేని పరిస్థితులున్నాయి. దీంతో తల్లిదండ్రులు సీఎస్ఈ యాజమాన్య కోటా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సీట్ల కోసం తమకు తెలిసిన వారిని, నేతలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వీటిల్లో 1,29,367 సీట్లున్నాయి. ఈ సీట్లలో అత్యధికంగా 82,984 సీట్లు సీఎస్ఈవే ఉన్నాయి. అత్యధిక సీట్లున్నా.. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం తీవ్రపోటీ నెలకొన్నది.