హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ పర్యాటక గ్రామాలుగా సోమశిల, నిర్మల్ ఎంపికయ్యాయి. 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటకశాఖ ఉత్తమ పర్యాటక గ్రామాలను శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 క్యాటగిరీల్లో 36 గ్రామాలను ఎంపిక చేయగా, కళాకృతుల విభాగంలో నిర్మల్, ఆధ్యాత్మిక, ఆరోగ్య విభాగంలో నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల అవార్డులు సాధించాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ అవార్డులను ప్రదానం చేశారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంటయ్య, నాగర్‌కర్నూలు జిల్లా పర్యాటకశాఖ అధికారి టీ నరసింహ అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది ఉత్తమ పర్యాటక గ్రామాలుగా సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్, జనగామ జిల్లాలోని పెంబర్తి గుర్తింపు పొందిన విషయం తెల్సిందే.