Revanth Reddy | కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. టికెట్ల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. మొదటి జాబితాకే అసమ్మతివాదులు రోడ్లపైకి వచ్చారు. ‘రేవంత్ హఠావో.. పీసీసీ బచావో’ అంటూ నినదిస్తున్నారు. టికెట్ల కేటాయింపుల్లో ముడుపులు ముట్టలేదని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రెబల్స్ రేవంత్‌కు సవాల్ విసిరారు. మంగళవారం భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమా ణం చేసిన ఉప్పల్, బహదూర్‌పురా కాంగ్రెస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీల్‌బాబా.. రేవంత్ కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి రోజురోజుకు ముదురుతున్నది. రేవంత్‌పై అసంతృప్తి పరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ హఠావో.. పీసీసీ బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలు లేవంటూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని టికెట్లు దక్కనివారు రేవంత్‌కు సవాల్ విసిరారు. మంగళవారం ఉప్పల్, బహదూర్‌పుర నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశించిన అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీల్‌బాబా తమ క్యాడర్‌తో కలిసి వచ్చి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ టికెట్ కేటాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకుంటూ రేవంత్ ఎన్నికలను అవినీతిమయం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కువ మొత్తంలో ముడుపులు అందించినవారికి మాత్రమే పార్టీ టికెట్లను కేటాయించారని తెలిపారు. తమ ఆరోపణల్లో నిజం లేకుంటే రేవంత్.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా 24 గంటల్లో ప్రమాణం చేయాలని ఉప్పల్ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే నిజం ఒప్పుకొని నిష్పక్షపాతంగా టికెట్లను కేటాయించాలని స్పష్టంచేశారు.
గోషామహల్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉన్నదని తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపిస్తామని నియోజకవర్గ నేతలు స్పష్టంచేశారు. ఖైరతాబాద్ నియోజకర్గానికి చెందిన సునీతరావుకు గోషామహల్ టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. టికెట్ మార్చాలని, లేకుంటే తామంతా రేవంత్‌ను సైతం గోషామహల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. గోషామహల్ ఆశావాహులైన యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినయ్‌కుమార్ ముదిరాజ్, సీనియర్ నేత కన్నయ్యలాల్ సాహు ప్రత్యేకంగా సమావేశమై రేవంత్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా భీం భరత్ పేరును ప్రకటించడంతో టికెట్ ఆశించి భంగపడ్డ ఇద్దరు నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు అభ్యర్థులను తేల్చకపోవడంతో రెండు చోట్లా టికెట్ల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. మహేశ్వరం సీటు కోసం పది మంది వరకు పోటీపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఆశావాహుల్లో ఒకరైన కొత్త మనోహర్‌రెడ్డిని ఇటీవనే పార్టీ సస్పెండ్ చేసింది. ఇబ్రహీంపట్నంలో ఏడుగురు ఆశావాహులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డి పోటాపోటీగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ తగాదాల నేపథ్యంలో క్యాడర్ సైతం గ్రూపులుగా విడిపోయింది. ఆశావాహులు ఎవరికి వారుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో లుకలుకలు నివ్వురు గప్పిన నిప్పులా ఉన్నాయని శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిని తేల్చాక అసమ్మతి భగ్గుమనక తప్పదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నది.