Congress Leader | కొత్తూరు, జనవరి 23: స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఎండ్ల శ్రీకాంత్‌కు మల్లాపూర్‌కు చెందిన రాధికతో వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఎండ్ల శ్రీకాంత్ గత ఆగస్టులో డెంగ్యూతో మృతి చెందాడు. శ్రీకాంత్‌కు పెండ్లి సమయంలో రాధిక తల్లిదండ్రులు ఎకరం భూమి ఇచ్చారు. తిమ్మాపూర్‌కు చెందిన వస్పుల మహేందర్ కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు.
వస్పుల మహేందర్, ఎండ్ల శ్రీకాంత్ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. శ్రీకాంత్ చనిపోవడంతో రాధిక పేరుపై ఉన్న ఎకరం భూమిపై మహేందర్ కన్నేశాడు. శ్రీకాంత్ రియల్ ఎస్టేట్‌లో ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశాడో చెబుతానని ఈ నెల 20న పట్టా పాస్‌బుక్ తీసుకొని రమ్మని రాధికతో నమ్మబలికాడు. అమె మహేందర్ దగ్గరకు వెళ్లడంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని తిరుపతి రూట్లో బయలుదేరారు. దారిలో రాధికను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు ఉంగరం, డబ్బులు తీసుకున్నాడు. ఖాళీ బాండ్లపై సంతకాలు చేయాలని, లేకపోతే కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించారు.
ఈ క్రమంలో మహేందర్, డ్రైవర్ మార్గమధ్యంలో కారు ఆపి మద్యం సేవించారు. వారు మద్యం మత్తులో ఉండగా అక్కడి నుంచి రాధిక తప్పించుకొని కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి మహేందర్‌పై ఫిర్యాదు చేసింది. సీఐ నరసింహారావు టీంను ఏర్పాటు చేసి మహేందర్, డ్రైవర్ శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, కారు, రెండు సెల్ఫోన్లు, ఉంగరం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎండ్ల శ్రీకాంత్ తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు మహేందర్, శేఖర్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మహిపాల్, రవికుమార్, హోంగార్డ్ నగేశ్‌ను సీఐ అభినందించారు.