వెల్దుర్తి, ఆగస్టు 10: ఓ వ్యక్తిని చంపి, అతని కారులోనే దహనం చేసిన ఘటన మంగళవారం మెదక్ జిల్లాలో కలకలంరేపింది. వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన కారుతోపాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి ఉన్న శవం దొరికింది. కారు ఇంజిన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ శ్రీనివాస్(45) పేరున ఉన్నట్టు తెలిసింది. అనుమానంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా, మృతదేహం వద్ద లభించిన పెట్టుడు పళ్లతో శ్రీనివాస్‌గా గుర్తించారు. కాగా, ఎక్కడో హత్యచేసి కారులో వేసి ఇక్కడ దహనం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా చిన్నశంకరంపేట, చేగుంట, రెడ్డిపల్లి ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు తిరిగినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయింది. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఏఎస్పీ కృష్ణమూర్తి పరిశీలించారు. మృతుడు శ్రీనివాస్‌కు స్థిరాస్తి వ్యాపారంలో పలువురితో గొడవలు ఉన్నాయని, ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసును ఛేదించడానికి 4 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.