హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, ధారాళంగా చదివేలా తయారుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక బడుల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభించనున్నది. ఇందులోభాగంగా ప్రస్తుతం 5వేల బడుల్లో చిన్నపాటి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో రీడింగ్ కార్నర్కు 240 చొప్పున పుస్తకాలు అందజేస్తారు.
రాష్ట్రంలో 18,233 ప్రాథమిక స్కూళ్లున్నాయి. వీటిలో కొన్నింటిలో గ్రంథాలయాలుండగా, మరికొన్నింటిలో లేవు. ఈ నేపథ్యంలోనే ఒకటి, రెండు గదులున్న ప్రాథమిక బడుల్లో గ్రంథాలయాల ఏర్పాటు సాధ్యం కాదు. కావున ఆయా బడుల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు.
తరగతి గదిలోని ఒక మూలను రీడింగ్ కార్నర్ (చదువుకునే మూల)గా అలంకరిస్తారు. ఆ ప్రాంతంలో బీరువా, పుస్తకాలు ఉంచి చదువుకొనే వాతావరణం కల్పిస్తారు. పిల్లలకు కేటాయించిన పీరియడ్లో రీడింగ్ కార్నర్లో చదువుకోవాలి. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన కార్యక్రమంలో మన రాష్ట్ర అధికారులు ‘రీడింగ్ కార్నర్’పై వివరించగా, కేంద్ర అధికారులు ప్రశంసించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పడిపోయాయి. పిల్లలు నేర్చుకొన్నదంతా మర్చిపోయారు. కొంత మంది చదవలేకపోతున్నారు. మరికొంత మంది రాయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను గాడినపెట్టేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహిస్తున్నది. తొలిమెట్టులో భాగంగానే బడుల్లో రీడింగ్ కార్నర్లను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులు కనీన సామర్థ్యాలను సాధించేలా చొరవ తీసుకోవాలి.