హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): న్యూజిలాండ్ ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ స్వచ్ఛందంగా రాజీనామా చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నేను మనిషిని, రాజకీయ నాయకులందరూ మనుషులే’ అంటూ జెసిండా తన రాజీనామాను ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘మనం చేయగలిగినంత కాలం సాధ్యమైన మేరకు ప్రజలకు సేవ చేయగలం. ఇప్పుడు నేను దిగిపోవాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. ‘ఆ ప్రధానమంత్రి (జెసిండా ఆర్డెర్న్)ది ఎంత హుందాతనం. అవును.. రాజకీయ నాయకులందరూ మనుషులే’ అని పేర్కొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని పూర్తి పచ్చదనంగా మార్చే ప్రక్రియగా చురుగ్గా సాగుతున్నదని, ఇది అక్కడి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప బహుమతి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. అక్కడ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీలోని 91 ఎకరాల్లో ఎకోపార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి. బాసర ట్రిపుల్ ఐటీ 280 ఎకరాల ప్రాంగణం మొత్తాన్ని పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ చేసే పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని అరవింద్ కుమార్ తెలిపారు.