కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించింది. మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. బాలింతలకు పౌష్టికాహారం, దవాఖాన చెకప్‌కు ప్రభుత్వమే తీసుకెళ్లడం, టిఫా యంత్రాలు, గర్భిణులకు కేసీఆర్ కిట్ వంటివి అమలు చేయడంతో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్బీఐ తాజా నివేదిక కితాబిచ్చింది. కానీ గడిచిన ఏడాది కాలంలో ఏం జరిగింది? న్యూట్రిషన్ కిట్ బంద్ అయ్యింది. దవాఖానల్లో మళ్లీ దశాబ్దం కిందటి దుర్భర దృశ్యాలు పునరావృతమవుతున్నాయి.
పేదలు చికిత్స కోసం వచ్చే ప్రభుత్వ దవాఖానలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం. కేసీఆర్ పాలనలో ఏడేండ్లలోనే 40 శాతానికిపైగా మాతాశిశుమరణాలు తగ్గాయి. ఇదీ ఆర్బీఐ తేల్చిచెప్పిన నగ్న సత్యం.మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమవి అసత్య ప్రచారాలని ఒప్పుకుంటారా?
ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే.. పాడుబడ్డ భవనాలు, చెదలుపట్టిన కుర్చీలు, ఖాళీగా పోస్టులు, అందుబాటులో లేనిమందులు, ఆమడదూరంలో అత్యాధునిక సదుపాయాలు. అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భవనాలు బాగయ్యాయి. చాలినన్ని మందులు, ఉచితంగా టెస్టులు, అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. మానవీయ కోణంలో అమలుచేసిన పథకాలు పేదలకు భరోసా ఇచ్చాయి.
ఫలితంగా.. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజుల నుంచి ‘చలో పోదాం సర్కారు దవాఖానకు’ అనే రోజులు వచ్చాయి.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కునారిల్లగా.. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా వేగంగా అడుగులు వేసింది. వైద్యరంగంలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలుచేసిన విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానలు, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు ఉత్తమ సేవలు అందిస్తే.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషాలిటీ సేవలు చెంతకు చేరాయి. ముఖ్యంగా మాతాశిశు సంరక్షణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణ అద్భుత ఫలితాలను ఇచ్చింది. కేవలం ఏడేండ్లలోనే 40 శాతానికిపైగా మాతాశిశు మరణాలను తగ్గించింది. ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచింది. ప్రైవేట్‌ను మించి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగాయి. ముఖ్యంగా కేసీఆర్ కిట్ వంటి పథకాలతో అనేక కోణాల్లో ప్రయోజనాలు కలిగాయి.
స్వరాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో మాతాశిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. మాతృమరణాల రేటు 81గా ఉండగా, శిశు మరణాల రేటు 35 ఉండేది. అత్యధిక మాతాశిశు మరణాలు నమోదైన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా ఉండేది. దీంతో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనులకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో వారికి పోషకాహారం కూడా అందడం లేదని తేలింది. దీంతో గర్భిణులు ఇంట్లో ఉండి, పోషకాహారం అందేలా ఏం చేయవచ్చో ఆలోచించింది.
ప్రత్యేకంగా అధికారులతో కమిటీని వేసి పథకాలకు రూపకల్పన చేసింది. ఈ క్రమంలోనే ముందుగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టటింది. ఈ పథకం బంపర్ హిట్ అయ్యింది. దీనికి అనుబంధంగా అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు అమలు చేసింది. ఫలితంగా మాతాశిశు మరణాలు తగ్గించడంలో విజయం సాధించింది. కేవలం ఏడేండ్లలోనే మాతాశిశు మరణాలు 40 శాతానికిపైగా తగ్గాయని ఆర్బీఐ నివేదికే స్పష్టంచేసింది. దీనిని బట్టే ఈ పథకాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది.
పేదలు, నిరక్షరాస్యత వల్ల అవగాహనలేని కొందరు ఇంటివద్దే ప్రసవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తేనే కేసీఆర్ కిట్ రెండో విడత నగదు సాయం రూ.4వేలు (ఆడబిడ్డ పుడితే రూ.5వేలు) అందించాలని నిబంధన విధించారు. దీంతోపాటు రూ.2వేలు విలువైన తల్లి, బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వందశాతం దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. తద్వారా దేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 2015లో 61% ఉండేవి. దవాఖాన ప్రసవాల్లో ప్రస్తుతం జాతీయ సగటు 95.5%గా నమోదైంది. దేశంలో 100% సురక్షిత ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రంగానూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. 2022లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 61% నమోదయ్యాయి. ఇది ప్రైవేట్ కన్నా 20% అధికం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 32% ఉంటే, ఇప్పుడు డబుల్ అయ్యింది.
కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి.. ఇలా బిడ్డలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. మాతృమరణాల రేటు.. 2014-16లో 81 ఉండగా.. 2018-20 నాటికి 43కు తగ్గినట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అంటే 47% తగ్గాయి. శిశుమరణాల రేటు 2014లో 35 ఉండగా, 2020 నాటికి 21కి తగ్గింది. అంటే 40% తగ్గుదల నమోదైంది. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యలోనూ గణనీయమైన మార్పు కనిపించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రభుత్వ దవాఖానల్లో 30%, ప్రైవేట్ దవాఖానల్లో 70% ప్రసవాలు జరిగితే.. పదేండ్లలో ఈ సంఖ్య రివర్స్ అయ్యింది.
నవజాత శిశుమరణాల రేటు..
మాతృ మరణాల రేటు..
గర్బిణుల్లో 10% మంది టిఫా స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది గర్భస్థ శిశువును నఖశిఖ పర్యంతం క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. శిశువులో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయోమో తెలుస్తుంది. అయితే ఈ టిఫా యంత్రాలు ప్రభుత్వ దవాఖానల్లో విరివిగా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ను ఆశ్రయించేవారు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి హరీశ్‌రావు గుర్తించారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఎంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నా, అన్ని రకాల పరీక్షలు టీ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచితంగా జరుపుతున్నా టిఫా స్కానింగ్ లేకపోవడం లోపంగా కనిపించింది.దీంతో ప్రభుత్వ దవాఖానల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేవలం రెండు నెలల్లోనే 44 దవాఖానల్లో 56 యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గర్భిణులకు ఒక్కో స్కానింగ్‌కు రూ.2000 వరకు ఆదా అవుతున్నది. 2023 నవంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్ఠికాహార లోపాలను నియంత్రించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పేరుతో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. మొదట రూ.50 కోట్లతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకానికి రూపకల్పన చేసింది. అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 21 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కిట్ల పంపిణీ ప్రారంభం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6.84 లక్షల మంది గర్భిణులు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించింది. పథకం విస్తరణ కోసం ప్రభుత్వం మరో రూ.200 కోట్లు ఖర్చు చేసింది.
సిజేరియన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. నార్మల్ డెలివరీల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచారం చేసింది. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించి సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరించారు. మరోవైపు, అనవసర సిజేరియన్లను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ను ప్రారంభించింది. గతంలో సి సెక్షన్లు చేస్తే ఇన్సెంటివ్ ఇచ్చే విధానం ఉండగా.. దానిని రద్దు చేసి సాధారణ డెలివరీలు చేసిన వైద్య సిబ్బందికి రూ.3000 ప్రోత్సాహకం అందించే విధానం ప్రవేశపెట్టింది.
మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, శిశుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఎంసీహెచ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రూ.407 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 22 ఎంసీహెచ్‌లను ఏర్పాటుచేసింది. వీటిద్వారా గర్భిణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు లభించింది.
కాంగ్రెస్ ఏడాది పాలనలోనే మళ్లీ తిరోగమన దిశ ప్రారంభం అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపేశారు.
ఆ తర్వాత సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే తమ ఖాతాల్లో డబ్బులు పడటం లేదని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. కిట్‌లో భాగంగా ఇచ్చే సరుకుల కిట్‌ను కూడా ఆపేసినట్టు చెప్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. సాధారణ ప్రసవాలపై పర్యవేక్షణ కొరవడటంతో సిజేరియన్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. నిమ్స్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఎంసీహెచ్ బ్లాక్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయాయి.
కేసీఆర్ కిట్‌లో భాగంగా గర్భిణుల నమోదు అనంతరం వైద్య సిబ్బంది ఏఎన్సీ చెకప్‌ల ద్వారా వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన మందులు అందజేస్తున్నారు. టిఫా స్కానింగ్ వంటి అత్యాధునిక పరికరాలను సైతం అందుబాటులోకి తె చ్చారు. అమ్మఒడి వాహనాల్లో దవాఖానకు సురక్షితంగా తీసుకెళ్తున్నారు. వీటన్నింటి ఫలితంగా 2021-22లో దేశంలోనే అతి తక్కువ గర్భస్రావాలు (అబార్షన్లు) నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కేవలం 0.9% అబార్షన్లు నమోదయ్యాయి. నెలలు నిండకముం దే ప్రసవాలు కూడా తెలంగాణలో అతి తక్కువగా 1.12% నమోదయ్యాయి.
తెలంగాణలో 93.8% మంది పిల్లలు సరైన బరువుతో పుడుతున్నట్టు నివేదిక తెలిపింది. కేసీఆర్ కిట్‌లో భాగంగా తరుచూ ఏఎన్సీ చెకప్స్ చేయడంతోపాటు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా వారికి పోషకాహారం అందించడం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించడం, ముర్రుపాలు అందించడంపై ప్రత్యేక దృష్టిసారించడం వల్లే ఇది సాధ్యమైంది. పుట్టిన పిల్లలకు గంటలోపు తల్లిపాలు అందించడంలోనూ తెలంగాణ టాప్ రాష్ర్టాల్లో నిలిచింది. 81% మంది పిల్లలకు ముర్రుపాలు అందుతున్నట్టు తెలిపింది. కేసీఆర్ కిట్‌లో మూడు, నాలుగో ఇన్స్టాల్మెంట్లను పిల్లలకు మూడో నెల, తొమ్మిదో నెల టీకాలు వేసిన తర్వాత అందిస్తారు. దీంతో పిల్లలందరికీ టీకాలు అందించడంలో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. రాష్ట్రంలో 100% మంది పిల్లలకు టీకాలు వేసినట్టు కేంద్రం అనేక సార్లు స్పష్టంచేసింది.
గర్భిణులు, బాలింతల సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు తల్లీ బిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించింది. తల్లులకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలను ప్రభుత్వం అందజేసింది. ఆడపిల్ల జన్మనిస్తే ప్రోత్సాహకంగా మరో రూ.వెయ్యి కలిపి రూ.13 వేలు అందించింది. 2023 మే నాటికి 13,90,636 మంది కేసీఆర్ కిట్లు అందుకున్నారు. వీరికి ప్రభుత్వం రూ.1,261 కోట్లు వెచ్చించింది.
కేసీఆర్ కిట్ కేవలం ఆర్థిక సాయం, అవసరమైన వస్తువుల రూపంలోనే కాదు.. సామాజికంగా అనేక ప్రయోజనాలు కల్పించింది. ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలు కలిగాయి. దీనిని నిరుడు విడుదలైన హెచ్ఎంఐఎస్ నివేదిక స్పష్టం చేసింది.
కేసీఆర్ కిట్ పొందాలంటే కచ్చితంగా గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో అంచనాలకు మించి గర్భిణుల నమోదు జరిగింది. హెచ్ఎంఐఎస్ నివేదిక ప్రకారం 2020-21లో రాష్ట్రంలో ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 103.82% నమోదుకాగా, 2021-22లో మరింత పెరిగి 108.39% నమోదైంది. తద్వారా పెద్ద రాష్ర్టాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్లో 89%, మధ్యప్రదేశ్‌లో 82% మాత్రమే ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు దాదాపు 70% మాత్రమే ఉండేవి.
గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమ లు చేస్తున్నది. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు వేడిగా అప్పుడే వండిన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. నెలలో కనీసం 25 రోజులపాటు అన్నం, పప్పు (పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో సాం బార్), ఉడికించిన గుడ్డు అందజేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద 36,26,603 మంది మహిళలు లబ్ధి పొందారు. రోజువారీ హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ‘ఆరోగ్యలక్ష్మి’ అనే యాప్‌ను రూపొందించింది. వారికి ఆహారం అందిచడమే కాకుండా, వారి ఆరోగ్య పరిస్థితిని ఈ యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 56% అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నూటికి నూరుశాతం అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్నది.
కేసీఆర్ కిట్‌లో.. గర్భిణిగా నమోదై, కనీసం రెండుసార్లు ఏఎన్సీ చెకప్ చేయించుకున్న తర్వాతే మొదటి విడత నగదు సాయం రూ.3వేలు అందించాలనే నిబంధన ఉన్నది. దీంతో గర్భిణులకు ఏఎన్సీ చెకప్స్ నిర్వహించడంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉన్నది. దీంతో రిజిస్టర్ అయిన గర్భిణులంతా ఏఎన్సీ చెకప్స్ చేయించుకుంటున్నారు. వారిని సురక్షితంగా దవాఖానకు తీసుకెళ్లి, పరీక్షలు చేయించి, తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. గర్భిణుల్లో 81% మందికి నాలుగు ఏఎన్సీ చెకప్స్ నిర్వహిస్తున్నట్టు హెచ్ఎంఐఎస్-2022 నివేదిక స్పష్టంచేసింది. గర్భిణులకు టీటీ, టీటీ బూస్టర్ వేయడంలోనూ తెలంగాణ 91%తో టాప్ రాష్ర్టాల్లో నిలిచింది.
కేసీఆర్ ప్రభుత్వం హెల్త్ బడ్జెట్ కేటాయింపులను ఏటేటా పెంచింది. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయిస్తే.. 2023-24 నాటికి రూ.12,364 కోట్లకు పెరిగింది. అంటే హెల్త్ బడ్జెట్ ఏకంగా రెండున్నర రెట్లు పెరిగింది. ‘మొదటి విడత పాలనలో ఇరిగేషన్, సంక్షేమంపై ఎక్కువగా దృష్టిపెట్టాం. రెండో విడతలో విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇందుకు తగ్గట్టే రెండో విడత అధికారంలో భారీగా కేటాయించారు. ఐదేండ్లలోనే కేటాయింపులు 113% పెరగడం కేసీఆర్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. 2023-24లో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపులు రూ.3,440గా నమోదైంది. తద్వారా పెద్ద రాష్ర్టాల్లో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది.
గర్భిణులు సురక్షితంగా ఇంటినుంచి దవాఖానలకు వెళ్లి, పరీక్షలు చేయించుకొని తిరిగి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 300 వాహనాలు ఉన్నాయి. ఇవి రోజూ వేలాది గర్భిణులను సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే కాకుండా.. వారికి రవాణా ఖర్చును తగ్గిస్తున్నాయి. సురక్షితమైన డెలివరీలకు కూడా బాటలు వేసింది. ఈ పథకం ద్వారా నిరుడు మే వరకు 18,46,635 మంది లబ్ధి పొందారు. ప్రభుత్వం రూ. 172.08 కోట్లు ఖర్చు చేసింది.