హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు (యూటీ) మారెట్ రుణాల కింద ప్రతిపాదించిన క్యాలెండర్ను భారతీయ రిజర్వు బ్యాం కు (ఆర్బీఐ) శుక్రవారం విడుదలచేసింది. తెలంగాణ ప్రభుత్వం 3వ త్రైమాసికంలో రూ.9,600 కోట్ల రుణ సమీకరణకు ఇండెంట్ పెట్టినట్టు తెలిపింది. అక్టోబర్లో రూ. 2,000 కోట్లు, నవంబర్లో 3,600 కోట్లు, డిసెంబర్లో 4,000 కోట్లు ఇలా.. మొత్తం రూ.9,600 కోట్లు మారెట్ రుణాల కింద ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి తీసుకుంటామని పేర్కొన్నట్టు వెల్లడించింది. ఇలా 2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మొత్తం మారెట్ రుణాల మొత్తం 2,81,865.00 కోట్లు అవుతుందని ఆర్బీఐ ప్రకటించింది.
బడ్జెట్ అంచనాకు మించి అప్పు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.64,539 కోట్లను ఎఫ్ఆర్బీఎం పరిమితిలో రుణ సమీకరణ చేస్తామని బడ్జెట్లో కేటాయించింది. ఇందులో రూ.54,009 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెండు త్రైమాసికాల్లోనే రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నది. ఏడాది లక్ష్యంలో 92 శాతం. 2 త్రై మాసికాల్లో రుణ సమీకరణ లక్ష్యంలో 4,109 కోట్లు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో మూడో త్రైమాసికానికి రూ.9,600 కోట్లు ఓ మార్కెట్ రుణాల కింద తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే అదనంగా మరో రూ.5,500 కోట్ల రుణం సమీరించబోతున్నది. చివరి త్రైమాసికంలో మరికొంత రుణ సమీకరణ చేసే అవకాశం ఉన్నందున ప్రజలపై అప్పులభారం మరింత పెరగనున్నది.