ముంబై, మే 22: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో సతమతమవుతున్న మోదీ సర్కార్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గొప్ప ఊరటనిచ్చింది. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను శుక్రవారం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో సెంట్రల్ బ్యాంక్ డివిడెండ్‌ను ప్రకటించింది. ఏకంగా రూ.2,86,588.46 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) రూ.2,68,590 కోట్ల డివిడెండ్‌ను అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి దాదాపు రూ.20,000 కోట్ల (6.7 శాతం)ను ఎక్కువగా ముట్టజెప్తుండటం గమనార్హం. దీంతో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి ఒకింత దన్ను లభించినైట్టెంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో, పెరిగిన ముడి చమురు ధరలతో దేశీయ ఇంధన అవసరాల కోసం ఎక్కువగా చెల్లించి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
ఫలితంగా ఫారెక్స్ రిజర్వులు (విదేశీ మారకం నిల్వలు లేదా డాలర్లు) వేగంగా కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ ఆల్‌టైమ్ హై డివిడెండ్ మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. కాగా, గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ నికర ఆదాయం రూ.3.96 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్నది. అంతకుముందు ఏడాది రూ.3.13 లక్షల కోట్లేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ రికార్డు డివిడెండ్‌కు ఆమోదం తెలిపారు. ఇక ప్రమాద నిధి (సీఆర్బీ)కి 2025-26కుగాను రూ.1,09,379.64 కోట్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జే, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్ సహా, డైరెక్టర్లు ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం నాగరాజు, వేణు శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
ద్రవ్యోల్బణంపై కన్నేయాలి
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో సమీప కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతోకొంత ప్రభావం ఉంటుందని, సరఫరా సమస్యల్ని ఎదుర్కోక తప్పదని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ప్రభావితం అవుతుందని, కనుక ధరల తీరుతెన్నులపై ఓ కన్నేయాలని సూచించింది. ‘మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల ప్రభావం కమోడిటీ మార్కెట్లపై కొనసాగుతున్నది. అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా సంబంధిత సమస్యలు ఆర్థిక మార్కెట్లలో ఒడిదుడుకులకు దారితీస్తున్నాయి. ఇక దేశీయంగా డిమాండ్ అనేదే వృద్ధికి చోదక శక్తి. అయినప్పటికీ కొంతకాలమైతే సరఫరాల్లో ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రధాన ద్రవ్యోల్బణం తప్పక ఆమోదయోగ్య స్థాయిలోనే ఉండాలి. కాబట్టి ధరల పోకడల్ని దగ్గరగా గమనించడం ఉత్తమం. అని దేశ ఆర్థిక వ్యవస్థపై ఓ ఆర్టికల్‌లో ఆర్బీఐ పేర్కొన్నది. గత నెల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.5 శాతానికి పెరుగగా, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసిన విషయం తెలిసిందే.
ద్రవ్య వ్యవస్థకు ఊతం
ఎగుమతుల్ని మించి దిగుమతులుండటం, గల్ఫ్ వార్ దెబ్బకు రవాణా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఏడాది మార్చి నెలలో స్పాట్ కరెన్సీ మార్కెట్లో నికరంగా 9.758 బిలియన్ డాలర్లను అమ్మినట్టు తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదలైన నెలవారీ బులెటిన్‌లో సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్నది. నిజానికి అంతకుముందు 2 నెలల్లో ఆర్బీఐ డాలర్లను కొన్నది. ఫిబ్రవరిలో 7.409 బిలియన్ డాలర్లు కొన్నది. ఇదిలావుంటే మూడు రోజుల వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి శుక్రవారం ఆర్బీఐ రూ.81,590 కోట్లను చొప్పించింది. అలాగే రూ.1.50 లక్షల కోట్లకు సోమవారం 4 రోజుల వీఆర్ఆర్ వేలాన్ని నిర్వహించనున్నది. బ్యాంకింగ్ వ్యవస్థలో స్వల్ప కాలానికిగాను ద్రవ్య లభ్యతను పెంచడానికి ఆర్బీఐ ఈ వీఆర్ఆర్ మార్గాన్ని అవలంబిస్తుంది.
మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్లు (రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం డివిడెండ్