హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): చిన్నచిన్న కాంట్రాకర్లకు బిల్లులు క్లియర్ చేయలేని రేవంత్‌రెడ్డి సర్కారు ఒలింపిక్స్‌ను నిర్వహిస్తదా? అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నిలదీశారు. కాంట్రాక్టర్లకు, సర్పంచ్‌లకు, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేని అసమర్థ ప్రభుత్వమిదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం భట్టి మొహం చూపించలేక పారిపోయారని విమర్శించారు. 20 శాతం కమీషన్లు తీసుకుని బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ఒలింపిక్స్ నిర్వహణకు తొలుత దేశం సిద్ధం కావాలని, రాష్ట్రం కాదని, సంచలనాల కోసం సీఎం గప్పాలు కొడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఓ మీడియా చర్చా వేదికలో తన అవగాహనారాహిత్యాన్ని చాటుకున్నారని ఆరోపించారు.
గత ఒలింపిక్స్ నిర్వహణకు లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యిందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహణ నుంచి పారిపోతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి జోకర్ మాటలు మాట్లాడి తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ వరల్డ్ పోటీలకు, ఒలింపిక్స్ నిర్వహణకు అసలు సంబంధం ఉన్నదా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చినప్పుడు తమకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు పరిస్థితి బాగా లేదని అంటున్నారని మండిపడ్డారు.
నెలకు రూ.500 కోట్లు కూడా పెట్టుబడి వ్యయం చేసే పరిస్థితిలో లేమని సీఎం చెప్తున్నారని విమర్శించారు. మరోవైపు అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని, ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంటున్నారని, సీఎం ఇలా తలాతోక లేకుండా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నమని అంటున్న రేవంత్‌రెడ్డి.. ఫార్ములా- ఈ రేసును ఎందుకు తప్పుబట్టారని నిలదీశారు. సీఎం, మంత్రుల మాటలను చూస్తుంటే సుతి, మతి, గతి లేని ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు.
సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి చెప్పినవి ఏవీ అమలు కావడం లేదని, మార్చి 1 నుంచి రేషన్‌కార్డుల పంపిణీ ఏమైందని నిలదీశారు. ముందు చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చిన తర్వాత సీఎం వేరే పెద్ద విషయాలు మాట్లాడాలని హితవు పలికారు. మోదీ- రేవంత్ బడేభాయ్, చోటేభాయ్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ను అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే ఎలా? అని నిలదీశారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీల బంధం కొనసాగుతున్నదని ఆరోపించారు.