మేడ్చల్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మహాత్మా జ్యోతిబాపూలే బాలికల వసతి గృహంలో ఎలుకలు కొరకడంతో ఐదుగురు 10వ తరగతి విద్యార్థినులు గాయపడ్డారు. ఘటనపై హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థినులను కీసర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇప్పటికే గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన విషయం బయటకు రాకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం గురుకులాలపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
వసతిగృహంలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఎలుకలు వస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా గోప్యత పాటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వసతిగృహంలో 1280 మంది బాలికలు చదువుతున్నారని, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎలుకలు కరిచాయని విద్యార్థులు చెబుతున్నా మామూలు దద్దుర్లు వచ్చాయని ప్రిన్సిపాల్ మహాలక్ష్మి అంటున్నారు.
ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్‌రావు
కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. విద్యార్థినులు దవాఖాన పాలుకావడం దారుణం అని, కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్కకాట్లు, పాముకాట్లు కరెంట్ షాక్‌లతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల గురుకులబాట కార్యక్రమం డొల్లతనం 24 గంటలు గడవకముందే బయటపడిందని విమర్శించారు. ప్రచారం పేరిట ఒక్క రోజు తమషా చేయడం మానుకుని, గురుకులాల్లో విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.