రామగిరి, ఫిబ్రవరి 14: ఇండస్ట్రియల్ పార్కుకు భూములిచ్చేది లేదని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామస్థులు తేల్చిచెప్పారు. రామగిరి ఖిల్లా మేడిపల్లి శివారులోని భూములను ఇండస్ట్రియల్ పార్కుకు ఇచ్చేది లేని స్పష్టం చేశారు. శుక్రవారం సమావేశమైన రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పలు పనుల కోసం 2008లో అప్పటి ప్రభుత్వం 150 ఎకరాల భూమి తీసుకుందని, మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 250 ఎకరాలు తీసుకోవడానికి చూస్తున్నదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తమ భూముల నుంచి రైల్వే లైన్, గ్యాస్‌పైపులైన్, పెద్ద టవర్ల లైన్, ఎల్లంపల్లి పైపులైన్ వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ భూములు కూడా పోతే బతకం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ దేవత బొడ్రాయితోపాటు రామగిరి తహసీల్దార్ సుమన్‌కు వినతి పత్రం అందజేశారు. వీరి ఆందోళనకు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు పలికారు.