హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కాలం చెల్లిన, డిమాండ్ లేని పీజీ కోర్సులను రద్దుచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. పాఠశాల విద్య తరహాలో డిగ్రీ కాలేజీలను రేషనలైజేషన్ చేయబోతున్నామని తెలిపారు. డిగ్రీ ఫస్టియర్‌లో నాలుగు లక్షల సీట్లుంటే, ఏటా రెండు లక్షలు మాత్రమే నిండుతున్నాయని పేర్కొన్నారు. శనివారం మండలి కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ సిలబస్ కొంత మేర మార్చామని, వచ్చే విద్యాసంవత్సరం పీజీ, పీహెచ్డీ సిలబస్‌ను మారుస్తామని తెలిపారు.