హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): ‘రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’.. ఇది కొత్త రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒకటి. కానీ ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో సర్కార్ ఇచ్చిన వట్టిమాటలలో ఇది కూడా చేరింది. వెబ్‌సైట్‌ను మూసివేయడంతో మీ-సేవలో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. వెబ్సైట్లో ‘అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యురిటీ కార్డ్ సర్వీస్ ఈజ్ నాట్ అవలెబుల్ ఎట్ ప్రజెంట్’ అనే మేసేజ్ దర్శనమిస్తున్నది. దీంతో కొత్త రేషన్‌కార్డు కోసం, మార్పులు, చేర్పుల కోసం మీ-సేవ కేంద్రాలకు వెళ్లిన వారంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు. రెండు నెలలపాటు దరఖాస్తులకు అవకాశం కల్పించిన పౌరసరఫరాల శాఖ.. తాజాగా నిలిపివేసింది. దీంతో అర్హులైన, మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. కొత్త కార్డు వస్తే మూడు నెలల బియ్యం ఒకేసారి తీసుకోవచ్చని భావించిన వారికి సర్కారు మొండిచేయి చూపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట మండలానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి కొత్త రేషన్‌కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇటీవల మంజూరైన కార్డులో ఆయన, ఆయన భార్య పేరు వేర్వేరు చోట్ల వచ్చాయి. ఆయన పేరు సొంత గ్రామం జాబితాలో రాగా ఆయన భార్య పేరు మాత్రం అత్తగారి ఊరి(భార్య సొంత ఊరిలో) జాబితాలో వచ్చింది. ఇప్పుడు ఆయన తన భార్య పేరును అక్కడ డిలీట్ చేయించారు. మళ్లీ తన ఊర్లో దరఖాస్తు చేసుకుందామని భావించగా మీ-సేవలో దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల తప్పిదంతో తనకు రేషన్‌కార్డు రాకుండా పోయిందని వాపోతున్నారు. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల కొత్త కార్డుల జారీలో అర్హులైన వేలాది మందికి అన్యాయం జరిగింది. అధికారులు చేసిన తప్పులను సరిచేసే సమయంలోపే దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారో లేదోనని, తమకు రేషన్‌కార్డు వస్తుందో లేదో అని వారంతా అందోళన చెందుతున్నారు.
కొత్త, పాత కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం సుమారు 19 లక్షలకు పైగా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. ఇందులో కేవలం 2 లక్షల దరఖాస్తులను క్లియర్ చేసిన ప్రభుత్వం వారికి కొత్త కార్డులు అందించినట్టు తెలిసింది. మిగతా 17 లక్షల మంది దరఖాస్తుదారులకు కాంగ్రెస్ సర్కారు మొండిచేయి చూపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో నిర్వహించిన గ్రామ పాలనలో 7 లక్షల దరఖాస్తులు రాగా, అంతకు ముందు 12 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ వడపోసిన ప్రభుత్వం కేవలం 2 లక్షల మందికే కార్డులను జారీచేసింది. అనర్హుల వడపోత కోసం ప్రభుత్వం 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్టు తెలిసింది. దీని వల్ల చాలా మంది అర్హులు చిన్న చిన్న కారణాలతో అర్హత కోల్పోయినట్టు సమచారం.