Ramayampet Gurukula | రామాయంపేట, జూలై 11 : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల దాడిలో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు. రామాయంపేటలోని కాళ్లగడ్డ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు వసతి గృహంలో ఎలుకల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం హాస్టల్కు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ప్రిన్సిపాల్ కలుగజేసుకుని విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపించారు.
విద్యార్థినులు మీడియాకు ఎలుకలు కరిచిన గాయాలను చూపించారు. రాత్రిపూట ఎలుకలు నిద్రపోనివ్వడం లేదని, హాస్టల్ ఆవరణలో కుక్కలతోనూ భయంగా ఉన్నదని పేర్కొన్నారు. హాస్టల్లో విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని ప్రిన్సిపాల్ సరళాదేవి తెలిపారు.