కోల్ సిటీ : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని అల్లూరు ప్రాంతానికి చెందిన చిరు మహిళా వ్యాపారి బాలసాని నిర్మల ( Balasani Nirmala ) కు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే గణతంత్ర దినోత్సవ ( Republic Day ) వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది.
ఈమేరకు శనివారం సాయంత్రం నగర పాలక కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ జే. అరుణ శ్రీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. స్వశక్తితో ఎదగాలనుకునే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నిర్మల చిరు వ్యాపారిగా పీఎం స్వనిధి పథకంలో పేరు నమోదు చేసుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో మొదటి విడత రుణం రూ.10వేలు పొంది తన ఇంట్లో ఒక చిన్న దుకాణం ప్రారంభించింది.

తన కాళ్లపై తాను నిలబడాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఆమె ప్రయాణంలో సకాలంలో రుణం తీర్చి రెండవ విడత రూ.20వేలు అందుకొని అందులోనే చీరల వ్యాపారం చేపట్టింది. ఆ వ్యాపారం విజయవంతం కావడంతో మూడో విడతగా రూ.50వేలు కూడా పొంది వ్యాపారాన్ని విస్తరించింది. నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వీధి వ్యాపారులకు ప్రభుత్వం అందించిన క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ సంపాదించింది.
దీంతో ఆమెకు జనవరి 26న న్యూఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్ తో కలిసి పాల్గొనడానికి మిషన్ డైరెక్టర్, మెప్మా నుంచి ఆహ్వానం లభించింది. పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలు, యువతులు సమయాన్ని వృథా చేయకుండా స్వయంకృషితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పేర్కొన్నారు.