హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేపీ మాజీ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ ఇవాళ తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు అని పొగిడారు. తెలంగాణ భూగర్భాన్ని నదీజల గర్భంగా మార్చిన భగీరథుడు అని కొనియాడారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకువెళ్తున్నదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చి అమలుచేస్తున్నారని ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా తనపై అప్యాయత, అనురాగాలు చూపిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరుల ప్రోత్సాహంతో తాను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించానని రాపోలు చెప్పారు.