హైదరాబాద్ సిటీబ్యూరో/బండ్లగూడ, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. 2017లో ఒక టీవీ షోలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్‌తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ముంబైలోని ఓ హోటల్లో తనపై లైంగికదాడికి పాల్పడినట్టు తెలిపింది. నార్సింగి పోలీసులు జానీమాస్టర్‌పై 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఇంట్లోనే విచారించారు. అనంతరం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మరిన్ని వివరాలను తెలిపింది. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని వేధిస్తున్నాడని చెప్పింది. ఒప్పుకోకుంటే అవకాశాలు రాకుండా అడ్డుకుంటానని బెదిరించినట్టు తెలిపింది. విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.