కడ్తాల్, సెప్టెంబర్ 8 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు ఎంతో ముందంజలో ఉన్నాయని అసోం రాష్ర్టానికి చెందిన ప్రజాప్రతినిధులు అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కోర్స్ డైరెక్టర్ ఏం.వీ. రాంబాబు నేతృత్వంలో బుధవారం అసోం రాష్ట్రంలోని టిన్‌సుఖియా జిల్లాలోని 28 మండలాలకు చెందిన ఎంపీపీలు (ఏపీలు), ఇద్దరు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కడ్తాల్ గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన రైతు వేదిక, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, ఎల్ఈడీ లైట్లు, అంతర్గత రోడ్లను వారు పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహణ ఎలా చేస్తున్నారు.. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను అడిగారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీలో ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అసోం రాష్ర్టానికి చెందిన ఏపీలు సుశ్దేవ్శర్మ, జ్యోతికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అద్భుతమని ప్రశంసించారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని, ఈ పథకాన్ని అసోం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితోపాటు పాలక మండలి సభ్యులను వారు అభినందించారు. కార్యక్రమంలో అసోం రాష్ట్ర ఏపీలు చిత్రలేఖ, కామాఖ్యప్రసాద్, సోనా, దురస్, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు భిక్షపతి, దీపికారెడ్డి, గణేశ్‌గౌడ్, మల్లయ్య, మహేశ్, మమత, అశోక్, రామచంద్రయ్య, శ్రీను, నాగార్జున్, సురేశ్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.